
గోల్కొండ సాహితీ మహోత్సవంలో భాగంగా సాహిత్య స్పూర్తి సంగోష్టికి ఉపస్థితులైన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో సాహిత్యం ఒక ఆయుధమై పోరాడిందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా దశరథి, దయానందర సరస్వతి, రాజారాం మోహన్ రాయ్, బంకించంద్ర, తిలక్ తదితరుల సాహిత్యాన్ని ఉదహరించారు. గరిమెల్ల సత్యనారాయణ గారి మాకొద్దీ తెల్లదొరతనం గేయం దేశమును ప్రేమించుమన్న, చిలకమర్తి భరతఖండంబు చక్కని పాడిఆవు అనే పద్యము ఇటువంటి సాహిత్యం జాతియోద్యమాన్ని ఉదృతం చేశాయి. ఇంతటి ఘన చరిత్రను బ్రిటిష్ వారు అణచివేసి వారి సొంత చరిత్రను రాశారు. మెకాలే మానసపుత్రులు కూడా దాన్నే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మనం మన చరితను వెలికితీయాల్సిన అవసరముందన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ తెలుగు శాఖాదిపతులు గుమ్మనగారి బాలశ్రీనివాస మూర్తి గారు మాట్లాడుతూ భారత స్వతంత్రోద్యమంలో పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయని, ఆ కాలంలో ప్రసార సాధనాలు లేకపోయినా, అక్షరాస్యత అంతగా లేకపోయిన దేశాన్ని పత్రికలే ప్రభావితం చేశాయన్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం వార్తలు చేరేవన్నారు. తెలుగులో మొట్టమొదటి సారి గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారు స్వరాజ్య పత్రికలో ఓ బ్రిటిష్ పిశాచమా అని రాసినందుకు దేశద్రోహం కింద వారు అరెస్టయ్యారు. స్వామి నాథన్ సదానంద్ గారు తన పత్రికలో బ్రిటిష్ వారిని ఎదిరించినందుకు వారికి 70వేల జరిమానా విధించారు. అదే విధంగా సుబ్రమణ్యభారతి స్వదేశీ మిత్ర పత్రిక, మట్నూరి వారి కృష్ణా పత్రిక అనాటి ప్రజలను, నాయకులను ఎంతో ప్రభావితం చేశాయన్నారు.