గోల్కొండ సాహితీ మహోత్సవంలో భాగంగా జరిగిన స్వాతంత్య్ర సమరంలో సాహిత్యం, జానపద కళల పాత్ర అనే సంగోష్ఠిలో సాహితీ వేత్త భాస్కర యోగి గారు మాట్లాడుతూ సామాజిక చైతన్యంలో జానపద సాహిత్యం పాత్ర అమోఘమని భాస్కర యోగి గారు అన్నారు. స్వాతంత్య్ర సమరంలో సాహితీవేత్తల కృషికి సమానంగా జానపదులు కృషి కూడా జరిగిందని తెలిపారు. ఇందుకు గాను ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వీరగాథను ఉదహరించారు. జానపదుల భజనపాటలు, కథలు, గేయాలు, ఒగ్గుకథ లాంటి కళారూపాల్లో ధర్మాధర్మ విచక్షణ మనకు కనపడుతోందని అన్నారు. భజనల ద్వారా దేశ భక్తిని కూడా ప్రభోదించారని అన్నారు. వెల్పూరి హన్మంతదాస్ రచించిన బొబ్బిలి యుద్ధం కథ ప్రజలను ఉత్తేజితులను చేసిందని తెలిపారు. దొడ్డి కొమురయ్య, కన్నెగంటి హన్మంతు, సర్వాయి పాపన్న తదితరులపై వచ్చిన గేయాలు యక్షగానాలు సామాన్య ప్రజానీకం నోటిలో నానాయని అన్నారు. నైజాం నవాబు ఆంక్షలను తప్పించుకోవడానికి తిరుపతమ్మ కథల పేరుతో రామయణం, భారతం చెబుతూ మన ధర్మం గురించి జానపదులు వివరించారని అన్నారు.
అనంతరం ప్రొఫెసర్ అరవిందరావు, గారు మాట్లాడుతూ 20 శాతం ఉన్న ముస్లింలు 80 శాతం అధికారాన్ని అనుభవించారని, తెలంగాణలో 1939 వరకు మక్తబా ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ఉర్దూ మాద్యమంగా నడిచేవని అన్నారు. నైజాం పరిపాలనలో తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో కన్నడ, మరాఠీల పాత్ర మరువలేనిదని అన్నారు. 1939లో కన్నడ సాహిత్య పరిషత్ స్థాపించినా కూడా నైజాం ఆంక్షల కారణంగా రహస్యంగా జాతీయోద్యమం నడిచిందని తెలిపారు. జాతీయోద్యమ ప్రభావంతో 350 గ్రామాలు స్వాతంత్య్ర ప్రకటన చేయడం కారణంగా రాయచూర్‌లో 3,756 మంది అరెస్టయ్యారు. వీరశైవ విద్యావర్థన్ హాస్టల్, నృపతుంగ పాఠశాల, కర్ణాటక శిక్షణా సమితి, కేశవ రావు కోరట్కర్ గారి పేర ఏర్పడ KMIT పాఠశాల జాతీయోద్యమ సాహిత్యానికి దోహదం చేశాయని అన్నారు. కీర్తన కేసరి, జయభేరి, నర్సింగదేవ లాంటి కవులు కన్నడ భాషా అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. మనం గోల్కొండ సాహితీ పురస్కారంతో సాహితీ వేత్తలను గౌరవించుకోవాలని కోరారు.
సంగారెడ్డి జిల్లాకు చెందిన అవదాని అవుసుల భానుప్రకాష్ గారు మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమంలో పద్యం పాత్రను వివరించారు. చిలకమర్తి లక్ష్మి నర్సిహం, కాళోజీ, మాడపాటి, సురవరం ప్రతాపరెడ్డి, ముదిగొండ లక్ష్మి నర్సింహ, ఓగేటి అచ్యుత రామయ్య వంటి కవులేందరో సమాజ చైతన్యానికి కృషి చేశారని తెలిపారు. సమాజంలోని వస్తువును వెతుక్కొని కవి మార్గనిర్ధేశం చేస్తాడని అన్నారు. ప్రాచీన విద్యా విధానంలో చదవడం అంటే పద్యం నేర్పడమేనని పద్యం గొప్పతనాన్ని తెలిపారు. మనం దేశ భక్తి, ఆత్మీయ శక్తి ఆధునికతతో ముందుకేగుదామని పిలుపునిచ్చారు.