గోల్కొండ సాహితీ మహోత్సవాల్లో రెండో రోజు స్వరాజ్య ఉద్యమాలపై జరిగిన సంగోష్టిలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత ప్రచార ప్రముక్ హెబ్బార్ నాగేశ్వర్ రావు గారు మాట్లాడుతూ భూమి, ఆవు రెండూ ఒక్కటే అనే సంస్కారం మన దేశానిదని, ఆవులను చంపే అలవాటు విదేశీయులదని అన్నారు. దిలీపుడు వేల గోవులను పోషించాడని, ఫిడెల్ క్యాస్ట్రో యువకుడిగా ఉన్నప్పుడే గోవులను తుపాకీ గుళ్ళకు గురి చేశారని చెప్పారు. విదేశీ సంస్కారానికి, మన సంస్కారానికి మధ్య నిరంతరం సంఘర్షణ కొనసాగుతున్నదని గుర్తు చేశారు. సంస్కారాల మధ్య సంఘర్షణే స్వాతంత్రోద్యమం అని చెప్పారు.
ఇప్పటికీ మనం గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నామంటే మనకింకా సాంస్కృతిక స్వాతంత్య్రం లభించలేదన్నారు. మన దేశంలో ఆవులను పోషించడం అనాదిగా వస్తున్న ఆచారమని అన్నారు. పెనుగొండ సాలువ వంశ పాలనలో ఆవుల సుబ్భన్న గారు ఆవులను రక్షించడానికి 30 మంది పోర్చుగీసు వారితో యుద్ధం చేయగా వీరిని అచ్చిరాజు, బుచ్చిరాజు సోదరులు రక్షించారని తెలిపారు. సోమరాజ ప్రాంతంలో ఉన్న తుర్రుపట్టులో పది నుంచి 20 వేల వట్టిపోయిన ఆవులుండేవని అన్నారు.
ఆ కాలంలో అరబ్బులు, తురష్కులు, హూణులు (మంగోళులు), మొగలాయిలు వంటి దుష్ట చతుష్టయం ఊర్లపై పడి ఆవులను దొంగలించారని తెలిపారు. వీరిని ముసునూరి నాయకులు ఎదిరించారని గుర్తు చేశారు. గంగిరెద్దుల భీమన్న గారు తన కూతుర్ని, గోవులను ఎత్తుకెళ్లిన తురష్కుల మీద యుద్ధం చేశారని తెలిపారు. గరిమెల్ల సత్య నారాయణ గారు కూడా “మాకొద్ధీ తెల్లదొరతనం” అనే కవితలో ఆవుల రక్షణ గురించి ప్రస్తావించారని తెలిపారు. 18వ శతాబ్ధంలోని మైసూర్ మహారాజు కూడా గోవులను ప్రాణంగా ప్రేమించేవాడని ఆయన ఇంటికి అతిథిగా వచ్చిన ఆంగ్లేయులకు గోవులను చూపితే వారు వాటిని కంచంలో వడ్డించమనడం వారి క్రూర మనస్తత్వానికి నిదర్శమని అన్నారు. ఇలా అడుగడుగున గో పోషణ, సంరక్షణ కోసం నిరంతరం ఉద్యమం కొనసాగుతోందని ఇక ముందు గోవులను రక్షించుకోవాల్సిన అవసరముందని అన్నారు.
తర్వాత ఆర్యసమాజ కార్యదర్శి వెంకటరఘురాం గారు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వారిలో 80శాతం మంది ఆర్యసమాజం వారే అని తెలిపారు. కాళోజి నారాయణ రావు, నరేందర్ జీ మహరాజ్, సి.హచ్ రాజేశ్వర్, కేశవరావు కోరట్కర్, పండిట్ నరేందర్ జీ వంటి వారు హైదరాబాద్‌లో ఆర్యసమాజ ఉద్యమాన్ని ఉదృతంగా కొనసాగించారని తెలిపారు. కులభేదం లేకుండా అందర్ని కలుపుకుని సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నిర్మాణం చేయడమే ఆర్యసమాజ లక్ష్యమని అన్నారు. దీనికోసం స్వామి దయానంద సరస్వతి, సత్యార్థ ప్రకాశాన్ని ప్రచరించారని తెలిపారు. ఇంటింటా యజ్క్షాలు జరగాలని, వేద ఘోష వినబడాలని ప్రచారం చేశారు. ఇలా ఆర్యసమాజ ఉద్యమం కారణంగా సుమారు 12వేల మంది నిజాం దారుణాలను ఎదిరించి జైలు శిక్షను అనుభవించారని తెలిపారు. హైదరాబాద్‌లోని ఈ ఆర్యసమాజ ఉద్యమం నాటి పార్లమెంట్‌లో చర్చకు దారి తీసిందని చెప్పారు. ఇప్పుడున్న డి.ఏ.వి పాఠశాల, కన్యా గురుకుల్, కె.ఎం.ఐ.టి విద్యా సంస్థలు ఆర్యసమాజ ఉద్యమ ప్రతి రూపాలే అని తెలిపారు. ఇలా ఆర్య సమాజ ఉద్యమం స్వరాజ్య ఉద్యమంలో ప్రధాన పాత్ర చేసిందని గుర్తు చేశారు.
ఆ తర్వాత ప్రముఖ జర్నలిస్టు రాకా సుధాకర్ గారు మాట్లాడుతూ “మదించిన మహిషాసురుని మర్థించేందుకు సర్వదేవతల ఆయుధాలతో అమ్మ వారు కదిలినట్టే” అందరూ కలిసివచ్చి భారత స్వాతంత్రోద్యమం వైపు కదిలారని తెలిపారు. అందులో ముఖ్యంగా స్వాతంత్రోద్యమం విద్యారంగంలోనే మొదలైందని తెలిపారు. చిన్ని చిన్న గ్రామాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసి సమాజంలో సంస్కరణల ద్వారా స్వాతంత్రోద్యమాన్ని నడిపారు. రాజమండ్రిలో గోదావరి ఒడ్డున “సదనం” అనే బాలికా విద్యాలయం, 1921లో అలియాబాద్‌లో ప్రారంభమైన “శారాద విద్యాలయం” 1947 వరకు రహస్య పాఠశాలగా నడవడం, కాకినాడలోని కోరంగిలో 900 ఎకరాల్లో వేద పాఠశాల నడవడం, రామచంద్రాపురంలో కృత్తివెంటి పేర్రాజు పంతులు గారి 100 ఎకరాల భూమిలో వ్యవసాయ పాఠశాల ఏర్పాటు కావడం, బందరులో హిందూ కళాశాల ఏర్పాటు ఇవన్నీ స్వాతంత్య్ర ఉద్యమానికి ఊతమిచ్చాయని అన్నారు.
విద్యారంగంతో పాటు, గ్రంథాలయోద్యమం కూడా స్వాతంత్య్ర సమరాన్ని ముందుకు నడిపిందని అన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయం, వరంగల్‌లో రాజరాజ నరేంద్ర గ్రంథాలయం, వై.ఎం.ఐ.ఎస్ (యంగ్ మెన్ ఇంప్రూవ్‌మెంట్ సోసైటి) ఆధ్వర్యంలో అలియాబాద్ గ్రంథాలయం 1920లో మరాఠీ గ్రంథాలయం, శ్రీ బాల సరస్వతి ఆంధ్ర భాషా నిలయం, శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం వంటివి స్వాతంత్రోద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయని తెలిపారు. పరిశ్రమల ద్వారా జంషెడ్జీ టాటా, తొలి స్వదేశీ స్టీం ఇంజన్ తయారు చేసిన చిదంబరం అయ్యర్, బెంగాల్‌లోని బోరోలిన్ అయింట్‌మెంట్, అమృతాంజనం, ప్రకాశం జిల్లాలో లోదా ఔషదం ఇవన్నీ కూడా విదేశీ వస్తు బహిష్కరణ చేసి స్వదేశీ ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా స్వాతంత్రోద్యమానికి తొడ్పడ్డాయని తెలిపారు. హిందీ భాష ద్వారా దేశాన్ని ఏకం చేయడానికి నాటి సమరయోధులు హిందీ ఉద్యమాన్ని మొదలుపెట్టారని అన్నారు. ఈ ఉద్యమ కారులు చక్రవర్తుల రాజగోపాలాచారి గారు తమిళులైతే, సావర్కర్ గారు మరాఠా, దుర్గాబాయి దేశ్‌ముఖ్ తెలుగు వారు మహాత్మ గాంధీ గుజరాత్ కు చెందిన వారుగా ఎవరూ కూడా హిందీ మాతృ భాష కలవారు కారని, అయినా దేశ ఐక్యత కోసం హిందీ ఉద్యమాన్ని చేశారని అన్నారు. న్యాపతి సుబ్బారావు ది హిందూ పత్రిక, ఒద్దిరాజుగారి ప్రింటింగ్ ప్రెస్ వరంగల్‌లో, రాజమండ్రిలో అనేక రకాలైన పత్రికల మాద్యమంగా స్వాతంత్య్ర పోరాటం కొనసాగిందని తెలిపారు.
జాగృతి సంపాదకులు గోపరాజు నారాయణ రావు గారు మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు చాలా కాలం ముందు నుంచే గిరిజన సమాజం స్వాతంత్రోద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిందని అన్నారు. 1675 నుంచి ఈ దేశంలో గిరిజన ఉద్యమాలు కొనసాగుతున్నాయని, 1867 మిడ్నాపూర్ లో గిరిజనులు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడం 1890లో బిర్సాముండా నేతృత్వంలో వనవాసీ ఉద్యమం బిల్లులు, కుర్దులు, కోయలు, హెల్బా జాతికి చెందిన వారు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1798 నుంచి గిరిజన పోరాటాలు మొదలయ్యాయని తెలిపారు. అల్లూరి సీతరామ రాజు మన్యం విప్లవం, రాంజీ గోండుతో సహ వేయి వంది బలిదానం, కోమురం భీం తిరుగుబాటు వంటి ఉద్యమాలు గిరిజనుల దేశభక్తిని స్వాభిమానాన్ని స్వరాజ్య కాంక్షను మనకు తెలియజేస్తున్నాయని అన్నారు.
మరాఠి సాహిత్య పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి విద్యాదియోధర్ గారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో మరాఠిల పాత్ర మరువలేనిదన్నారు. బాలగంగాధర్ తిలక్ గారి కేసరి, మరాఠా పత్రికలు జనులను ఏకం చేశాయని అన్నారు. తెలుగు నేలలో కేశవరావు కోరట్కర్ గారు, చాపేకర్ సోదరులకు ఆశ్రయమివ్వడం, కాంగ్డాలో వినాయక రావు విద్యాలయం, వివేకవర్ధిని పాఠశాలలను మరాఠాలే స్థాపించారని అన్నారు. గోరక్ష ఆందోళన, విధవా వివాహం, బాలికా విద్యా, స్త్రీ విద్య లాంటి సామాజిక సంస్కరణోద్యమాలను మరాఠాలు నడిపారని అన్నారు. 1911 తర్వాత నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరాఠాల ఉద్యమం ఉదృతమైందని అన్నారు. దేశంలోనే తొలిసారిగా విశ్వవిద్యాలయంలో మరాఠా విభాగం స్థాపించడం 1918లో ఓయూలో జరిగిందని అన్నారు. భాషోద్యమంతో మరాఠా ఐకమత్యానికి కృషి చేశారని అన్నారు. 1923లో బలవంతపు ఉర్ధూ నుంచి రక్షించుకోవడానికి మరాఠా విద్యాలయాల ఏర్పాటు జరిగిందని తెలిపారు. ఇలా తెలుగు నెలపై స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.