
భారత స్వతంత్ర అమృతోత్సవాల సందర్భంగా భాగ్యనగరంలోని కేశవ మెమోరియల్ కళాశాలలో గోల్కొండ సాహితీ మహోత్సవానికి 20.11.2021 ఉదయం 10గం.లకు ఘనంగా శ్రీకారం చుట్టినారు. దేశ ప్రజల్లో స్వధర్మ, స్వాభిమాన, స్వరాజ్య భావాలను పెంపొందించుటకు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను ఏర్పాటు చేశారు. కేశవ మెమోరియల్ కళాశాల ఆవరణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణం అందిరిని ఆకట్టుకునేలా ఉంది. ఆ వెనకాల భారత ఔట్ రీచ్ బ్యూరో (భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ) వారి సహకారంతో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శిని అద్భుతంగా ఉంది. ఇందులో భారత స్వంతంత్ర సమరయోధుల చిత్రాలు, నిజాం దుష్ట కోరల నుంచి తెలంగాణను కాపాడడానికి పాటుపడ్డ కవులు, కళాకారులు, యోధుల చిత్రాలతో పాటు వారి సంక్షిప్త జీవిత చరిత్ర కలిగి ఉండటం ఆకట్టుకునేలా ఉంది.
సభా ప్రాంగణమైన సర్ధార్ పటేల్ హాల్ నందు ఉపన్యాస వేదిక ఏర్పాటు చేశారు. పక్కనే జాతీయ సాహిత్య విక్రయశాలలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు సమాచార భారతి, జాతీయ సాహిత్య పరిషత్, సంస్కార భారతి, ఇతిహాస సంకలన సమితి, కేశవ స్మారక శిక్షా సమితి , ప్రజ్ఞా భారతి వారు నిర్వహకులుగా వ్యవహరించారు.