సమాచారభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్కొండ సాహితీ మహోత్సవంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్‌రెడ్డి గారు మన దేశ పునర్వైభవ సాధనకు ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు భాగయ్య గారు, ప్రముఖ రచయిత రతన్ శార్దా గారు కళాశాల ఆవరణలోని సర్దార్ పటేల్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ప్రారంభమైన సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వాగతోపన్యాసం చేస్తూ.. గోల్కొండ సాహితీ మహోత్సవ ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని ఆహూతులకు వివరించారు. అదే విధంగా వేదికపై ఉన్న పెద్దలు బండారు దత్తాత్రేయ గారిని, కిషన్‌రెడ్డి గారిని, భాగయ్య గారిని, కోవెల సుప్రసన్నాచార్య గారిని, రతన్ శార్దా గారిని, ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణమూర్తి గారిని పరిచయం చేశారు. వేదికపై ప్రముఖ జర్నలిస్టు వల్లీశ్వర్ గారు, సమచార భారతి అధ్యక్షులు గోపాల్‌రెడ్డి గారు ఉన్నారు.
ప్రముఖ రచయిత శ్రీ రతన్ శార్దా గారు ఆంగ్లంలో రచించిన “Sangh and Swarajya అనే పుస్తకాన్ని కేశవనాథ్ గారు స్వరాజ్య సాధనలో ఆర్.ఎస్.ఎస్ పేరిట తెలుగులోకి అనువదించగా శ్రీ కిషన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరాటంలో విస్మరించబడ్డ వీరులను స్మరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలో స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొన్న వనవాసీ వీరుడు బిర్సాముండా జయంతిని జాతీయ గిరిజన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కూడా కోమురంభీం, రాంజీగోండు, అల్లూరి వంటి గిరిజన వీరులను గాధలను పరిచయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం గిరిజన మ్యూజియం ఏర్పాటు కోసం రూ.15కోట్లు కేటాయించిందని తెలిపారు. నేటి కవులు, రచయితలు కూడా దేశ సంస్కృతిని, ఐకమత్యాన్ని ప్రేరెపించే రచనలు చేసి జాతీయవాదాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.