గోల్కొండ సాహిత్య మహోత్సవంలో భాగంగా జరిగిన ప్రచురణ కర్తల సమ్మేళనంలో ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ ప్రొఫెసర్ అన్నదానం సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ సమాజ దశను, దిశను సాహిత్యమే అని అన్నారు. అందుకోసం రచయితలు చేసిన రచనలను ప్రచురణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఏ పరిస్థితులు ఎదురైనా రచయితలు రచనలు ఆపవద్దని, ఆలోచనలు అక్షర రూపం దాల్చాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద పుస్తకం చదవడం కారణంగానే అన్నా హజరే దిశ మారిందని, ఆంగ్లంలో రఘువీర్ రాసిన స్వామి పుస్తకం చదవడం కారణంగా ఇండోనేషియా జాతిపిత సుకర్నొ దిశ కూడా మారిందని అన్నారు.
గౌతమబుద్దుని చరిత్ర చదవడం కారణంగానే అంబేద్కర్ మహాశయుని ఆలోచనల్లో అద్భుత మార్పు వచ్చిందని అన్నారు. ఇలా సామాజిక స్పృహ ఇతివృత్తంగా రచనలు జరగాలని వీటిని ముద్రణ కర్తలు ప్రొత్సహించాలని, ముద్రణ కర్తలు, రచయితల మధ్య పరస్పర సంబంధాలు పెరగాలని ఆకాంక్షించారు. రచనాశైలి పిల్లలకు సైతం అర్థమయ్యే స్థాయిలో ఉండాలని సూచించారు. పుస్తకం కొని, చదివే మానసిక స్థితిని సమాజంలో నిర్మాణం చేయాలని చెప్పారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత రతన్ శార్దా గారు మాట్లాడుతూ రచయితలు తమ రచనలను మార్కెటింగ్ చేయడం అసలు సమస్యగా మారిందని అన్నారు. పుస్తకాలు అందరినీ చేరుకోవడానికి అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని రచనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సామాజిక మాద్యమాలకు అలవాటు పడ్డ యువత సైతం రచనలు చదివేలా చేయాల్సి ఉందన్నారు.